Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవసూగూర్ సుగురేశ్వర వీరభద్ర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి దేవసూగూర్ చేరుకున్నారు. దేవాలయం ఆవరణలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం అమావాస్య రోజు ఇక్కడ పూజలు చేయడం ఎంతో ప్రత్యేకమని పూజారులు ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయం విశిష్ఠతను పూజారులు మంత్రికి మంత్రికి వివరించారు. అనంతరం సమీపంలోనే ఉన్న నాగర ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జేపీఎన్సీ కళాశాలల చైర్మన్ కె ఎస్ రవికుమార్ ఉన్నారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సులు దేవసూగూర్ లో నిలపాలి కర్ణాటక ఆర్టీసీ బస్సులన్నీ రాయచూరు నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో దేవసూగూర్ దేవాలయం వద్దకు వస్తున్నాయని... కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులు మాత్రం రావడం లేదని భక్తులు, పూజారులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి అక్కడి నుంచే ఆర్టీసీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తో మాట్లాడి తప్పనిసరిగా తెలంగాణ నుంచి రాయచూరు వైపు వెళ్లే ప్రతి బస్సు దేవసూగూర్ దేవాలయం వద్దకు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారుల తీరు వల్ల కార్పొరేషన్ ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో కూడా తాను ప్రత్యేకంగా మాట్లాడుతానని మంత్రి వివరించారు.
Admin
Abhi9 News