Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ కోరారు. పాలనా పరమైన కారణాల వల్ల గత మూడు వారాలుగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పిర్యాదుదారులు వచ్చి వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూములకు సంబంధించిన ఫిర్యాదులు, అలాగే ఇతర అంశాలకు సంబంధించి మండల స్థాయిలో పరిష్కారమయ్యే ఫిర్యాదుల పై సంబంధిత మండలాల తహసిల్దార్లు ,ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా జిల్లా అధికారులకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా జిల్లా అధికారిని తన వద్దకు పిలిపించుకొని ప్రజలు సమర్పించిన ఫిర్యాదులపై తక్షణం చర్య తీసుకోవాలని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజావాణిలో మధ్యాహ్నం 2 గంటల వరకు పిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పిస్తూనే ఉన్నారు .కొన్ని ఫిర్యాదులు అక్కడే పరిష్కరించగా, మరికొన్నిటి పై ఎండార్స్ చేస్తూ ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.ఈ సోమవారం సైతం ఎప్పటిలాగే భూములకు సంబంధించిన ఫిర్యాదులు, వ్యక్తిగత అంశాలు, తదితర అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.ఈ ప్రజావాణి కార్యక్రమానికి స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డిఆర్డిఓ యాదయ్య, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ తో పాటు, జిల్లా అధికారులందరూ హాజరై ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.
Admin
Abhi9 News