Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పల్లె ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతులు అన్నింటిపై ప్రజలకు వివరించాలి- జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్...గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ,ప్రజలు, గ్రామస్థాయి సిబ్బంది అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ ఆదేశించారు. పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహణ పై బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయాలని, తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ఉత్సవాలు నిర్వహించాలని, పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో కల్పించిన మౌలిక సదుపాయాలన్నింటిని శుభ్రం చేయడమే కాకుండా, గ్రామస్తులు ఆయా మౌలిక సదుపాయాలను సందర్శించే విధంగా చూడాలని కోరారు. గతంలో ఎలాంటి సౌకర్యాలు గ్రామాలలో ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపించాలని తెలిపారు.గ్రామ సర్పంచు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారని, అందరూ క్షేత్రస్థాయి సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరుకావాలని, జాతీయగీతం ఆలపించాలని అన్నారు .గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ ఇచ్చామని, వాటి అన్నింటిని అందరూ తెలుసుకునే విధంగా ప్రదర్శించాలన్నారు. పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలలో ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యేలా చూడాలని ,పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధులు, పొందిన లబ్ది, మౌలిక వసతుల వివరాలను తెలియజేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. గతంలో గ్రామంలో పరిశుభ్రత పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో తెలియజేయాలని, వర్షం వస్తే గటిజంలో సంక్రమిస్తున్న వ్యాధులు, వాటిని ఇప్పుడు ఎలా అరికట్టగలిగామో, అదేవిధంగా గ్రామీణ జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయో తెలియజేయాలని, ఇందుకు సంబంధించి నాడు- నేడు చిత్రాల ద్వారా ప్రజలకు తెలియచేయాలని, ఆ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు .అంతే కాక గ్రామంలో ర్యాలీ నిర్వహించాలని మన ఊరు -మనబడి కింద చేపట్టిన పనులు, సబ్ సెంటర్లు ,పాఠశాలల అభివృద్ధి వాటన్నింటి గురించి తెలియజేయాలని కోరారు.స్థానిక సంస్థలు,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ యాదయ్య, జెడ్పి సీఈవో జ్యోతి, పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహణపై సూచనలను తెలియజేసారు.
Admin
Abhi9 News