Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పట్టణాలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .తెలంగాణ రాకపూర్వం మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య లేదని,మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు తాగునీరు అందిస్తున్నామని, అదేవిధంగా విద్యుత్ సమస్య సైతం తీరిపోయిందని, పట్టణంలో పార్కులు అభివృద్ధి చేశామని ,పాఠశాలలు వచ్చాయని, ప్రత్యేకించి 6 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 6 కళాశాలలు ఏర్పాటు చేశామని, రహదారులు, జంక్షన్ లను అభివృద్ధి చేశామని, ఐటి పార్క్ వచ్చిందని, 300 కోట్ల రూపాయల రుణాలను పట్టణ మహిళా సంఘాలకురుణాలు ఇచ్చామని, మహిళలకు రక్షణ పెరిగిందని, షీ టీమ్స్ ,సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరం నాటికి ఐటి పార్క్ ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఉన్నచోటనే ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల స్థలాలు, భూముల రేట్లు, భవనాల రేట్లు పెరిగాయని, ప్రస్తుతం ఉన్న శిల్పారామం ఒకప్పుడు దుర్గంధంతో ఉండేదని, దానిని అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని, ఇవన్నీ ప్రజలు గమనించాలని ఆయన తెలిపారు.తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 10 గురుకులాల నుండి ఇప్పుడు 1000 గురుకులాలకు పెంచడం జరిగిందని తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన వీరన్నపేటలో 800 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామని, త్వరలోనే వీరన్నపేట వెనకవైపు ఆర్టీవో ఆఫీస్ దగ్గర 30 ఎకరాలలో నూతన ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించనున్నామని, చిన్నదర్పల్లిలో 350 ఎకరాలలో ఫుడ్ పార్కు రానుందని ,అప్పన్నపల్లి రెండవ ఆర్వోబి పూర్తి అయిందని, 12 నెలల్లోనే దీన్ని పూర్తి చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ రాక ముందు పట్టణంలో 2000 మందికి పెన్షన్లు ఇస్తే ఇప్పుడు 20000 మందికి నెలకు 2,000 పెన్షన్ ను , నెలకు 4 కోట్ల 50 లక్షల రూపాయలు ఇస్తున్నామని ,సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లు ఇస్తున్నామని, కరోనా సమయంలో పట్టణవాసులకు చికిత్స అందించడమే కాకుండా, రేషన్ సరుకులు అందజేశామని తెలిపారు. పట్టణాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రత్యేకించి మహబూబ్నగర్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు మిషన్ భగీరథ తాగునీరు వస్తుందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత పట్టణాలలో మౌలిక సదుపాయాలు పెరిగాయని, పట్టణాల అభివృద్ధి కై చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వివిధ నిధుల ద్వారా చిన్న పట్టణాలను సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితోపని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ రాకపూర్వం మహబూబ్నగర్ పట్టణం ఎలా ఉందో ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది మంత్రిని గజమాలతో సత్కరించగా, ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులకు, ఉత్తమ సర్వీసులు అందించిన సంస్థలు, ఇతర పారిశుధ్య కార్మికులను మంత్రి సన్మానించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్,కమిషనర్ ప్రదీప్ కుమార్ ,కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు
Admin
Abhi9 News