Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. స్వదేశంలో విమర్శిస్తే ప్రజలకు తెలుస్తుంది అనే భయంతో అమెరికాలో రేవంత్ రెడ్డి తన నిజస్వరూపాన్ని విద్యుత్ వ్యతిరేక వ్యాఖ్యలతో బయట పెట్టుకున్నాడని మంత్రి దుయ్యబట్టారు. తక్షణమే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతంగానికి క్షమాపణలు చెప్పకుంటే వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా... మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ లో ఉన్న విద్యుత్ భవన్ ఎదుట గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తీరును మంత్రి దుయ్యబట్టారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతుకు ఎన్నడు ప్రయోజనం చేకూరలేదని.. వారి పాలనలో కరెంటు లేక రైతు ఆగమయిండని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పగటిపూట మూడు గంటలు రాత్రిపూట మూడు గంటలు మాత్రమే కరెంటు ఇచ్చి అన్నదాత ఆగమయ్యేలా చేశారని విమర్శించారు. మళ్లీ 3 గంటల కరెంటుతో రైతును ఆగం చేయాలని రేవంత్ కుట్ర చేస్తున్నాడని అన్నారు. నిన్న ధరణి, నేడు కరెంటు... భవిష్యత్తులో రైతుబంధు, రైతు బీమా సహా సంక్షేమ పథకాలు ఏవి వద్దంటడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటే ఓర్వలేక రేవంత్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు ఎంతో అవస్థలు పడేవారని సక్రమంగా కరెంటు ఇవ్వాలని బషీర్ బాగ్ లో ఆందోళన చేసిన అన్నదాతలపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ ఉద్యోగులు సిబ్బంది గ్రామాలకు వెళ్తే రైతులు ప్రజలు దాడి చేస్తారనే భయంతో బిక్కుబిక్కుమని గడిపేవారని... తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించామన్నారు. మళ్లీ మూడు గంటల కరెంటు తీసుకువచ్చి రైతులు, విద్యుత్ సిబ్బంది ఇద్దరికీ కంటి నిండా కొనుకు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. సరైన కరెంటు లేకుంటే పరిశ్రమలు మూతపడతాయని, వ్యవసాయం కుంటుపడుతుందని తద్వారా అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా సరఫరా అవుతున్న 24 గంటల కరెంటు వద్దన్నందుకు రేవంత్ రెడ్డి చెంపలు వేసుకుని ముక్కు నేలకు రాసి రైతులందరికీ క్షమాపణ చెప్పాలని లేదంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రైతు వ్యతిరేక రేవంత్ కు రైతులే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, రైతుబంధు సమితి పట్టణ అధ్యక్షుడు గోనెల రాములు, వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Abhi9 News