Abhi9 News - తెలంగాణ / Hyderabad : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలో మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు చేరారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేతలు ఇవాళ (మంగళవారం) లొంగిపోయారు. డీజీపీ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. అయితే, పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది. అలాగే, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్‌లపై రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే, అజ్ఞాతంలో 64 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 8 మంది రాష్ట్ర కమిటీ, మరో ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు లొంగిపోయారు. 9 మంది మాత్రమే తెలంగాణలో, మిగిలిన వారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 5 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 20 మంది డిస్ట్రిక్ కమిటీ, 14 మంది ఏరియా కమిటీల్లో, 10 మంది తెలంగాణ కమిటీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు: డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులు చంద్రన్న, బండి ప్రకాశ్ అజ్ఞాతం వీడారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పిలుపు మేరకు.. మావోయిస్టులు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు. పుల్లూరి ప్రసాద్ రావుది పెద్దపల్లి జిల్లా అని తెలిపారు. చంద్రన్న15 ఏళ్లు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారని గుర్తుచేశారు. చంద్రన్న మొదట రాడికల్ స్టూడెంట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి. 1980లో కిషన్‌జీకి కొరియర్‌గా చంద్రన్న పనిచేశారని గుర్తుచేశారు. 2008లోనే కేంద్ర కమిటీ మెంబర్‌గా చంద్రన్న ఉన్నారని తెలిపారు. 2024 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఆయన ఉన్నారని వివరించారు. అక్టోబరు 21వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రన్న జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పుకొచ్చారు. చంద్రన్న ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో అజ్ఞాతం వీడారని పేర్కొన్నారు డీజీపీ శివధర్ రెడ్డి.
Admin
Abhi9 News