Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాబోయే కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈ వి ఎం) సంచార వాహనాల ద్వారా ఓటర్లలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి . రవి నాయక్ తెలిపారు . శనివారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయ ఆవరణలో జిల్లాలోని మహబూబ్ నగర్, జడ్చర్ల ,దేవరకద్ర నియోజకవర్గాలకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ఈవీఎంల ప్రదర్శన సంచార వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ఓటు వేసే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎలా ఉపయోగించాలో ఈ వాహనాల ద్వారా ప్రత్యక్షంగా ఓటర్లకు చూపించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లు ఐదేళ్లకోసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఈ వి ఎం ల పై ఏలా ఓటు వేస్తారో అదే విధంగా సంచార వాహనాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను ప్రతి నియోజకవర్గానికి ఒక ఈ వి ఎం సంచార వాహనంతో పాటు, నియోజకవర్గ కేంద్రంలో ఉండేలా మరో స్టాటిక్ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వాహనాలతో పాటు, అధికారులు వచ్చి ఓటర్లకు ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి , గతంలో ఓటు వేసిన వారికి సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఎలా ఓటు వేయాలో చూపిస్తారని తెలిపారు. ప్రత్యక్షంగా ఈవీఎంలపై ఓటు వేయడం వల్ల ఓటు వేసే సమయంలో ఓటర్లకు సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సంచార వాహనాల వల్ల పట్టణ ప్రాంతాలలో సైతం ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ .మోహన్ రావు, ఆర్ డి ఓ అనిల్ కుమార్,డి ఆర్ డి ఓ యాదయ్య, హౌసింగ్ ఈ ఈ భాస్కర్ ,సమాచార శాఖ ఏ డి వెంకటేశ్వర్లు,కలెక్టర్ కార్యాలయ ఏ ఓ శంకర్,ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు అఖిల ప్రసన్న తదితరులు ఉన్నారు.
Admin
Abhi9 News