Abhi9 News - తెలంగాణ / Hyderabad : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఎర్రశేఖర్.. తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పూర్తిగా ఖండించారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ రాజకీయాల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. కానీ, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేసిన చరిత్ర ఉన్నవారు ఉన్నారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు' అంటూ ఎర్ర శేఖర్‌ను ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి వారి కోసం నేను 'జెడ్ కేటగిరి' సెక్యూరిటీ అడగాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి గేటు వద్దకు వెళ్లినా కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకదని, కావాలనే ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని తిరిగి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ స్పష్టతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కామెంట్స్ జడ్చర్ల నియోజకవర్గంలో హాట్ టాఫిక్‌గా మారాయి.
Admin
Abhi9 News