Abhi9 News - తెలంగాణ / Hyderabad : మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు చేపడితే తప్పనిసరిగా సెలవులు తీసుకోవాలని నిబంధన విధించింది. డ్యూటీలో ఉండగానే అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని సూచించింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించినందుకు సౌత్ ఈస్ట్ జోన్ కంచన్‌బాగ్ ఎస్సై కృష్ణకాంత్‌కు పోలీసు శాఖ మెమో జారీ చేసింది. అంతేకాకుండా పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే షూస్ లేకుండా సివిల్ డ్రెస్సులో (బ్లాక్ డ్రెస్) డ్యూటీ చేయవద్దని హెడ్ ఆఫీస్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పోలీస్ శాఖలో చాలా మంది అయ్యప్పమాల దీక్ష ధరిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు మాలలు ధరిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్‌శాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక డ్యూటీలో ఉన్న పోలీసులు కచ్చితంగా యూనిఫామ్ ధరించాల్సి ఉంటుంది. ఒకవేళ దీక్షలో ఉంటే ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుంటే రెండు నెలల పాటు సెలవులు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీక్ష ధరించి విధులకు రావొద్దని.. నల్ల దుస్తులు, నల్ల కండువాలు ధరించి యూనిఫామ్ లేకుండా విధులకు హాజరుకావొద్దని పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసు శాఖ ఆంక్షలపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం కూడా పోలీస్ శాఖ ఇలాంటి ఆదేశాలు ఇస్తోందన్నారు. హిందువులకే ఇలాంటి రూల్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్ వేళ ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరు అంటూ రాజాసింగ్ విరుచుకుపడ్డారు.
Admin
Abhi9 News