Abhi9 News - క్రైమ్ వార్తలు / నంద్యాల : ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో వేగంగా దూసుకెళ్లిన కారు.. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. మృతిచెందిన వారిని గుండురావు(60), శ్రావణ్ (22), నరసింహ, బన్నీగా గుర్తించారు. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ సైతం పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు మృతిచెందడం అత్యంత దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తరచూ రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో ప్రయాణికులు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి జనార్దన్ రెడ్డి సూచించారు.
Admin
Abhi9 News