Abhi9 News - క్రైమ్ వార్తలు / కర్నూలు : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా సజీవ దహనమయ్యారు. ఉపాధి నిమిత్తం బెంగళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం బలి తీసుకుంది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి, ఘటనకు గల కారణాలను మీడియాకు వివరించారు. బస్సు కిందకు ఒక బైక్ దూసుకురావడంతో, డోర్ తెరుచుకోవడానికి ఉపయోగపడే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయని, సుమారు 20 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైందని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కొందరు స్థానికులు మానవత్వం చాటుకున్నారు. హిందూపుర్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా, పుట్టపర్తి నుంచి వస్తున్న హైమరెడ్డి అనే మహిళ బస్సులో మంటలు రావడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Admin
Abhi9 News