Abhi9 News - క్రైమ్ వార్తలు / : 23కోట్ల రూపాయల మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉప్పల సతీష్‌ను హైదరాబాద్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేసినట్లు ఉప్పల్ సతీష్‌పై అభియోగాలున్నాయి. దీంతో.. ఆయనపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి.. ఉప్పల సతీష్‌ను నెల రోజుల క్రితమే పట్టుకోగా.. పోలీసుల్లోనే కేటుగాడిగా మారిన శ్రీకాంత్ గౌడ్ అనే టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ కారణంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణలో భాగంగా.. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఎస్‌ఐ నేతృత్వంలో ఓ బృందం అక్కడికి వెళ్లింది. అక్టోబర్ నెల 23వ తేదీన రాత్రి సతీష్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. నిందితులను పోలీసు వాహనాల్లో తరలించాల్సిన ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ మాత్రం.. వారి కారులోనే ప్రయాణం చేశాడు. స్వాధీనం చేసుకున్న ఫోన్లు కూడా వారికి ఇవ్వడంతో ఉప్పల సతీష్ తెలివిగా వ్యవహరించాడు. వారి వాహనాన్ని కూడా నిందితుడి డ్రైవరే నడపడం మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా.. షోలాపూర్‌లో నిందితులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత.. గత నెల 24న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉప్పల సతీష్, ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్‌లోని ఓ దాబా దగ్గరకు చేరుకోగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కారెక్కి నిందితులు పారిపోయారు. కానీ.. ఏమీ తెలియనట్టు వెనుక వస్తున్న తన బృందానికి ఉప్పల సతీష్ పారిపోయినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ నాటకం ఆడారు. ఈ ఘటనపై విచారించిన ఉన్నతాధికారులు.. సతీష్‌ను తప్పించేందుకు ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌కు రెండు కోట్ల రూపాయిలు ఆఫర్ చేసినట్లు తేల్చి ఆయన్ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆపై.. ఉప్పల సతీష్‌పై మరోసారి ఫోకస్ పెట్టి ముమ్మరంగా గాలించడంతో ఎట్టకేలకు మళ్లీ ముంబైలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికాడు.
Admin
Abhi9 News