Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : ‘సారీ మై బాయ్.. నేను నీకు నచ్చినట్టుగా ప్రేమగా ఉండలేక పోతున్నాను. నీకు సంతోషం ఇవ్వలేక పోతున్నాను. ఇదే నా చివరి మెసేజ్’.. అని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అయితే సదరు యువకుడి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదంటూ మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్‌పేట్ సర్కిల్ స్వామిరెడ్డినగర్ కాలనీలో నివసించే అశోక్-రూప దంపతుల కుమార్తె ఎ.విహారిక (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు డెకరేషన్ పని చేసే అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప కు చెందిన కిషోర్(32)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. కొంత కాలంగా కిషోర్ ఆమెను దూరం పెట్టసాగాడు. దాంతో మనస్థాపానికి గురైన విహారిక ఐదు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. కిషోర్ తనతో పెళ్లికి నిరాకరించడంతోనే విహారిక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె వాట్సాప్ స్టేట్‌సలో పెట్టిన మెసేజ్‌లను బట్టి తెలుస్తోంది. ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా కుటుంబసభ్యులతో కలిసి బిగ్‌బాస్ షో చూడడమే కాకుండా తన సోదరుడి బర్త్‌డే సందర్భంగా అర్ధరాత్రి తర్వాత కేక్ కూడా కట్ చేయించినట్టు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ రాత్రి రెండు గంటల తర్వాత తన రూమ్‌లో చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అంతకు ముందు ఆమె తన వాట్సాప్ స్టేట్‌సలో రెండు మెసేజ్‌లో పెట్టినట్టు సహచర విద్యార్థుల ద్వారా వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యుల వేధింపుల ఫిర్యాదు, వాట్సాప్ స్టేటస్ మెసేజ్‌ల ఆధారంగా మీర్‌పేట్ పోలీసులు నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
Admin
Abhi9 News