Abhi9 News - క్రైమ్ వార్తలు / : పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో సామూహిక అత్యాచారానికి గురైన 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని తండ్రి తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురి ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ.. ఆమెకు మెరుగైన చికిత్స, రక్షణ అందించేందుకు తక్షణమే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు తరలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. బాలాసోర్ జిల్లాలోని జలేశ్వర్‌కు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు.. ఈ దారుణం గురించి తెలియగానే హుటాహుటిన పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి దుర్గాపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈక్రమంలోనే "నా కూతురిని భువనేశ్వర్‌కు తరలించేందుకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరుతున్నాను. ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని నేను భయపడుతున్నాను" అని ఆమె తండ్రి ఆదివారం తెలిపారు. తాము పశ్చిమ బెంగాల్‌లో సురక్షితంగా లేమని, ఎవరినీ నమ్మడానికి వీల్లేదని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నిందితులు తన కుమార్తెను చంపేస్తారని.. ఆమె ఆరోగ్యం మెరుగైనప్పటికీ ప్రాణాలకు ప్రమాదం ఉందని అన్నారు. తాను స్థానిక అధికారులను నమ్మలేనని చెప్పారు. ప్రస్తుతం తాను దుర్గాపూర్‌లో ఎక్కడో దాక్కుని ఉన్నానని.. తన డయాబెటిక్ భార్య మాత్రం ఆసుపత్రిలో తమ కూతురి పక్కనే ఉండి చూసుకుంటున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి మాఝీయే స్వయంగా శనివారం రాత్రి బాధితురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఆదేశాల మేరకే బాలాసోర్ అధికారుల బృందం ఆసుపత్రిని సందర్శించిన తర్వాత.. బాధితురాలి తండ్రి ఒడిశా ప్రభుత్వాన్ని బహిరంగంగా సహాయం కోరారు.
Admin
Abhi9 News