Abhi9 News - క్రైమ్ వార్తలు / నిజామాబాద్ : మరో రెండు రోజుల్లో ఓ యువకుడు పెళ్లి బంధంలో అడుగుపెట్టబోతున్నాడు. ఇంట్లో పెళ్లి పనులు కూడా జోరందుకున్నాయి. బంధువులు రావడం కూడా మొదలైంది. దీంతో ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. అంతా ఆనందంగా పెళ్లి రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఇంతలో ఆ యువకుడు చేసిన పనితో కుటుంబసభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసింది. రెండే రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు తీసుకున్న నిర్ణయం పెళ్లింట విషాదాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (30) పెళ్లి నిశ్చయమైంది. మరో రెండు రోజుల్లో అతడి వివాహం. కానీ ఏదో విషయంలో కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. అది చిలికి చిలికి గాలివానగా మారాయి. కుటుంబ తగాదాలతో ప్రతాప్ గౌడ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన ప్రతాప్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. టానా కలాన్ శివరులో చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లితో కళకళలాడాల్సి ఇళ్లు... బంధువుల రోదనలతో నిండిపోయింది.
Admin
Abhi9 News