Abhi9 News - జాతీయ వార్తలు / : దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గతేడాది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోనే యువతిపై హత్యాచారం ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా, ఈ ఘటనపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అర్ధరాత్రి విద్యార్థులు బయటకు వెళ్లడంపై ప్రశ్నించారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల భద్రతను పూర్తిగా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. పశ్చిమ్ బెంగాల్‌లో మరో వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. దుర్గాపూర్‌లో ప్రయివేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోన్న 23 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో ఉండగా.. ముగ్గురు యువకులు అతడ్ని బెదిరించి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌తో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆమె బయటకు ఎందుకు వెళ్లారని దీదీ ప్రశ్నించారు. ప్రయివేట్ కాలేజీల్లో విద్యార్థుల భద్రత పూర్తిగా యాజమాన్యాలే వహించాలని పరోక్షంగా స్పష్టం చేశారు. ‘ఆమె ప్రయివేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది.. ఆమె అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో బయటకు వెళ్తే దీనికి బాధ్యత ఎవరిది?’ అని నిలదీశారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్న సీఎం మమత.. బెంగాల్ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రయివేట్ మెడికల్ కాలేజీలు తమ విద్యార్థుల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో వారు బయటకు వెళ్లే విషయంలో పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ‘విద్యార్థులను బయటకు రావడానికి అనుమతించవద్దు’ అని బెనర్జీ అన్నారు.
Admin
Abhi9 News