Abhi9 News - జాతీయ వార్తలు / మహబూబ్ నగర్ : ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన దక్షిణ కొరియాలోని వార్ మెమోరియల్ ఆఫ్ కొరియాలో ఉన్న సైనిక కళాఖండాలను పోలిన విధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలోనూ పలు సైనిక కళాఖండాలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి మంగళవారం నాడు ఆ దేశ రాజధాని సియోల్ లో ఉన్న వార్ మెమోరియల్ ఆఫ్ కొరియాను సందర్శించారు. 1950 యుద్ధ సమయంలో దక్షిణ కొరియాను రక్షించడంలో భారతదేశం చేసిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ ఆ దేశం ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని కూడా మంత్రి సందర్శించారు. 1994లో ప్రారంభించిన సైనిక మ్యూజియం ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియం అని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ట్యాంకులు, యుద్ధనౌకలు మరియు ఆపరేషన్‌లో ఉపయోగించిన నిజమైన B-52 బాంబర్‌లతో సహా అనేక రకాల అరుదైన సైనిక కళాఖండాలను తాము తిలకించినట్లు వెల్లడించారు. ఎంతో ఆకట్టుకునేలా ఉన్న ఈ సైనిక మ్యూజియంలో ఉన్న పలు కళాఖండాలను పోలిన వాటిని మహబూబ్ నగర్ శిల్పారామంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, పర్యాటకశాఖ ఎం.డి మనోహర్, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ తదితరులు ఉన్నారు.
Admin
Abhi9 News