Abhi9 News - క్రీడలు / : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డ బుమ్రా.. అప్పట్నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో బుమ్రా ఆడి ఫిట్‌నెస్‌ను చాటుకునే ప్రయత్నం చేస్తాడని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి పరిమితమయ్యాడు. దీంతో బుమ్రా ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు మంగళవారంతో గడువు ముగుస్తుండంతో బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఒకవేళ బుమ్రాను తప్పిస్తే అతని స్థానంలో పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకునే అవకాశముంది. టోర్నీ మధ్యలో బుమ్రాను ఆడించాలనుకుంటే మాత్రం అతడిని 15 మంది బృందంలో కొనసాగించొచ్చు. అప్పుడు కూడా బుమ్రా అందుబాటులోకి రాకుంటే కొత్త ఆటగాడి ఎంపికకు ఐసీసీ సాంకేతిక కమిటీ అనుమతి తప్పనిసరి. బుమ్రా చివరి దశలో అయినా అందుబాటులోకి వస్తే చాలనుకుంటోంది జట్టు యాజమాన్యం. టోర్నీ మొత్తానికి దూరమైతే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడడం ఖాయం. బుమ్రా కోసం ప్రత్యేక బృందం: బుమ్రాను ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించేందుకు ఎన్‌సీఏ బృందం గట్టి ప్రయత్నమే చేస్తోంది. జనవరి 3-5 మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన చివరి (అయిదో) టెస్టులో బుమ్రా గాయపడ్డ సంగతి తెలిసిందే. వెన్నుగాయం తిరగబెట్టడంతో ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మధ్యలో అతను బౌలింగ్‌కు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ పూర్తిగా బౌలింగ్ చేయకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. స్వదేశానికి వచ్చాక కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం కోలుకునే ప్రక్రియలో భాగంగా అతను ఎన్‌సీఏకు వెళ్లాడు. అక్కడ నలుగురైదుగురితో కూడిన ప్రత్యేక బృందం బుమ్రాను ఫిట్‌గా తయారు చేసే ప్రక్రియలో భాగమైంది. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియో, వైద్యుడితో పాటు ఒకరిద్దరు సహాయ సిబ్బంది అతడికి సాయపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడడం జట్టు టైటిల్ గెలవడానికి ఎంతో అవసరం కావడంతో ఆ సమయానికి ఎలాగైనా అతణ్ని సిద్ధం చేయాలని ఈ బృందం ప్రయత్నిస్తోంది. బీసీసీఐ, భారత జట్టు యాజమాన్యం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని తెలుసుకుంటున్నాయి. మంగళవారం చివరగా అతడిని పరీక్షించి, తన ఫిట్‌నెస్‌పై నివేదికను వైద్య బృందం బీసీసీఐకి అందజేయనుంది. మరి ఆ నివేదిక ఏం తేలుస్తుందో చూడాలి.
Also Read : బుమ్రాపై నిర్ణయం నేడు
Admin
Abhi9 News